ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వార్తలను ఖండించిన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్
ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడేకు పెజిష్కియాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వార్తలను ఆయన ఖండించారు. మోజ్తాబా ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పాడు. 2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా.. ఆయన కుటుంబ సభ్యులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయతొల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడుల తర్వాత ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. చివరకు ఆయన తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. దీంతో మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొనడంతో అతడి మరణ వార్తల పుకార్లకు తెరపడింది.