జైన చాతుర్మాసంలో భాగంగా బిచ్చగాడి వేషంలో బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా : సోషల్ మీడియాలో వీడియో వైరల్
ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరాగ్ షా బిచ్చగాడి వేషంలో రోడ్డు పక్కన కూర్చొని ప్రజల మధ్య తిరుగుతూ కనిపిస్తారు. ఈ వీడియో సోషల్ మీడియా వేగంగా వైరల్ అవుతోంది. కోట్ల రూపాయల ఆస్తులున్న ఎమ్మెల్యే బిచ్చగాడి వేషం ఎందుకు వేశారని వీడియో చూసిన మొదటి చూపులోనే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది. జైన మత గురువు నామరముని మహారాజ్ సూచన మేరకు పరాగ్ షా ఈ అనుభవాన్ని చేపట్టారు. జైన చాతుర్మాసంలో ఓ రోజు బిచ్చగాడి జీవితం గడిపి ఆ అనుభవాన్ని అర్థం చేసుకోమని ఆయనకు సలహా ఇచ్చారు. తన గురువు సలహా మేరకు ఆ ఎమ్మెల్యే తన భద్రతను, విలాసవంతమైన కారును, ఖరీదైన వస్తువులను వదిలిపెట్టి ఓ బిచ్చగాడి పాత్రను పోషించారు. పరాగ్ షా మేకప్ వేసుకుని బిచ్చగాడి వేషంలో ఘట్కోపర్ స్టేషన్ కాంప్లెక్స్ వీధుల్లో తిరిగారు. ఆ సమయంలో ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు. పరాగ్ షా రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్ పైనే తినేవారు. ఇతర వీధి బిచ్చగాళ్లలాగే ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా తన రోజును అదే విధంగా గడిపారు. ఈ అనుభవం సందర్భంగా ఓ బిచ్చగాడి దైనందిన జీవితం ఎలా ఉంటుందో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో ఎమ్మెల్యే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవడానికి పరాగ్ షా తాను బిచ్చగాడిగా గడిపిన ప్రదేశాలను తిరిగి సందర్శించారు. ఈసారి ఆయన తన మేకప్‌ను తొలగించి తన నిజ స్వరూపంలో ప్రజలతో మాట్లాడారు. ఈ మొత్తం సంఘటన ఒక వైరల్ వీడియోలో రికార్డ్ చేయబడింది. ఎమ్మెల్యే చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరాగ్ షా మహారాష్ట్రలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.3,383 కోట్లకు పైగా ఉందని ప్రకటించారు. దీంతో ఆయన మహారాష్ట్రలోని అత్యంత ధనిక అభ్యర్థులలో ఒకరిగా నిలిచారు.దాదాపు ఐదేళ్ల క్రితం ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లు. ఏళ్లు గడిచేకొద్దీ ఆయన సంపద విపరీతంగా పెరిగింది. పరాగ్ షా వ్యాపారం ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఆయన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. ఆయన ఘట్‌కోపర్ వీధుల్లో బిచ్చగాడి వేషంలో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment