ఆంధ్రప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు బ్యాంకు క్రెడిట్ కార్డులు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. వ్యాపార పెట్టుబడుల కోసం కనీసం పది వేలు నుంచి గరిష్ఠంగా ముప్పై వేల రూపాయల వరకు ఈ కార్డుల ద్వారా డబ్బు వినియోగించుకోవచ్చు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి ప్రధాన నగరాలతో పాటు ఇతర పట్టణాల్లో కలిపి సుమారు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరు ప్రధానంగా కూరగాయలు, పళ్లు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ కుటుంబాలను పోషిస్తున్నారు. చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అటువంటి చిరు వ్యాపారులు ఒక్కోసారి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్టుబడికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. బయట అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక మరింత ఆర్ధిక సంక్షోభంలో పడుతున్నారు.ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు వడ్డీ వ్యాపారుల బెడద ఎక్కువగా ఉంటోంది. వడ్డీలకు వడ్డీలు వసూలు చేయటంతో వారు కుదేలవుతున్నారు. కొత్తగా ఇచ్చే క్రెడిట్ కార్డులను కేవలం వ్యాపార అవసరాలకే వాడాలి. ఇతర కొనుగోళ్లకు ఉపయోగించే అవకాశం ఉండదు. అలా అయితేనే వారి వ్యాపారాలకు సహాయం చేసినట్టు అవుతుంది. ప్రస్తుతం 3.59లక్షల మంది చిరు వ్యాపారుల వద్ద క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయి. మరో లక్ష మందికి కొత్తగా స్కానర్లు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇంకా రుణాలు పొందని 1,61,481 మందికి అక్టోబరు నెలాఖరు వరకు అదనంగా రూ.5 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు 'లోక కల్యాణ మేళా' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ చర్యలు చిరు వ్యాపారులకు వడ్డీ భారం తగ్గించి, సులభంగా పెట్టుబడి సాధ్యం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Comments
Post a Comment