మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తాం !


మూసీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లను  నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. అంతేకాకుండా అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని, వారి పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని వివరించారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీని తీర్చిదిద్దుతుంటే ప్రతి అడుగులో అడ్డుపడటం సరికాదన్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలి, మురికిలోనే బతకాలి అనే ధోరణి ప్రతిపక్ష పార్టీ నాయకులు వీడాలని ఆయన హితవు పలికారు. ఈ మహా యజ్ఞం ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూసీ నది ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా ఉన్నాయని, నదిలోకి వచ్చే ప్రతి నాలా వద్ద ఎస్టీపీలను ఏర్పాటు చేసి మురికినీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే మూసీలోకి గోదావరి నీటిని వదులుతామని తమ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో చాలా స్పష్టంగా వివరించామని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి, మేధావుల నుంచి వచ్చే మెరుగైన సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గండిపేట నుంచి బాపు సరోవర్ వరకు మొదటి దశలో చేపడుతున్న ఈ పునరుజ్జీవ కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్నది కాదని, మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రతి నిర్ణయంలోనూ అత్యంత పేదవాడి కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతోనే తాము ముందుకు సాగుతున్నామని మంత్రి భట్టి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేద ప్రజలకు అత్యుత్తమమైన హైజీనిక్ వాతావరణాన్ని కల్పించి, వారిని ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడమే తమ లక్ష్యమన్నారు. విపక్షాలు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అభినందించాలని కోరుతున్నానన్నారు.బీఆరఎస్ నేతల మాదిరిగా తాము ప్రచార ఆర్భాటం చేయమని, మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వవచ్చు.. మంచి సలహాలు ఉంటే స్వీకరించి ముందుకు వెళతాం అని భట్టి విక్రమార్క చెప్పారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం