ఆల్-టైమ్ గరిష్టానికి చేరిన భారత విదేశీ మారక నిల్వలు : రష్యాను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్

ర్బీఐ చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం రికార్డు స్థాయిలో పెరగడంతో విదేశీ మారక నిల్వలు ఆల్-టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది. ‘బ్లూమ్‌బర్గ్’ డేటా ప్రకారం సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 44.9 బిలియన్ డాలర్లు పెరిగి 785.7 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. ఈ భారీ పెరుగుదలతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది జూన్ 8న ప్రవేశపెట్టిన ఫారెన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్ల స్పెషల్ స్వాప్ పథకానికి అనూహ్య స్పందన లభించడమే ఈ డాలర్ల వరదకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పథకం ద్వారా కేవలం 11 వారాల్లోనే దేశంలోకి 73 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. నిర్దేశిత లక్ష్యం గడువు కంటే ముందే నెరవేరడంతో, ఆర్బీఐ ఈ పథకాన్ని సెప్టెంబర్ 30కి బదులుగా ఆగస్టు 31నే ముగించింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశ పసిడి నిల్వల విలువ 2.59 బిలియన్ డాలర్లు తగ్గినా, డాలర్ల ప్రవాహం అధికంగా ఉండటంతో మొత్తం నిల్వలు భారీగా పెరిగాయి. విదేశీ మారక నిల్వలు ఇంత భారీగా పెరగడం దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠతకు సంకేతమని, ఇది రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు స్థిరీకరించేందుకు ఆర్బీఐకి మరింత బలాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం