సైమా అవార్డ్స్ 2026 - ఉత్తమ నటుడు తేజా సజ్జా, ఉత్తమ నటి ఐశ్వర్య రాజేశ్
బెంగళూరులో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ -2026 ప్రదానోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్థానిక కోరమంగళ ఇండోర్ స్టేడియంలో కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకకు దక్షిణాదికి చెందిన అగ్ర సినీ తారలు, దిగ్గజ దర్శకులు, సాంకేతిక నిపుణులు విచ్చేసి సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ సినీ ఉత్సవాల్లో భాగంగా, తొలిరోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. తారల తళుకుబెళుకులు, వినోదభరితమైన నృత్య ప్రదర్శనల మధ్య ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. తెలుగు యువ కథానాయకుడు తేజ సజ్జా.. 'మిరాయ్' చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ 'ఉత్తమ నటుడు' అవార్డును కైవసం చేసుకున్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా తేజ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం విశేషం. అలాగే, విభిన్న కథాంశంతో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలను పండించిన ఐశ్వర్య రాజేశ్ 'ఉత్తమ నటి (క్రిటిక్స్)' పురస్కారాన్ని అందుకున్నారు. అదే చిత్రం నుంచి బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా ఎంపికై తన సత్తా చాటారు. 'కాంతార: చాప్టర్ 1' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించి, ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధులను చేసిన రిషబ్ శెట్టి కన్నడ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు.
Comments
Post a Comment