నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి సమీపంలోని మండీ కృష్ణాపురంలో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మండీ కృష్ణాపురంలో ‘చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా’కి చెందిన నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవన పైకప్పుపై కాంక్రీట్ వేస్తున్న సమయంలో, సుమారు 20 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టీల్ స్కాఫోల్డింగ్, సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్ బరువును తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కాంక్రీట్ స్లాబ్‌తో పాటు పైన పనిచేస్తున్న కార్మికులు భారీ శిథిలాలు, ఇటుకలు, రాళ్ల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 11 మంది కార్మికులను అంబులెన్సుల్లో వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రులకు తరలించారు. మరికొందరిని పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వెల్లూరు జిల్లా కలెక్టర్ పి.ఎస్. లీలా అలెక్స్ తెలిపారు. అరక్కోణానికి చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఫైర్ సర్వీస్ ,పోలీసులతో కలిసి శిథిలాలను తొలగించి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశారు. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అవసరమైన బిల్డింగ్ పర్మిషన్లు, ప్లాన్ అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Post a Comment