న్యూఢిల్లీకి చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య చర్చలు ప్రధానంగా చాబహార్ ఓడరేవు, ప్రాంతీయ కనెక్టివిటీ, వాణిజ్యం భారత్-ఇరాన్ ఆర్థిక సంబంధాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇరు దేశాలు తమ ఆర్థిక దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న తరుణంలో పెజెష్కియన్ పర్యటన జరుగుతోంది. బ్రిక్స్ షాంఘై సహకార సంస్థ వంటి బహుపాక్షిక వేదికల ద్వారా ప్రాంతీయ ప్రపంచ అంశాలపై భారత్, ఇరాన్ సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఈ సదస్సులో భాగంగా భారత ప్రధాన మంత్రి మోడీ, పెజెష్కియన్ ఉన్నత స్థాయి సమావేశాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే తజికిస్థాన్ లోనిర్వహించిన ఎస్సీఓ సదస్సులో, ఈ ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఇరాన్‌తో వాణిజ్యాన్ని విస్తరించడంపై భారత్‌కు ఉన్న ఆసక్తిని మోదీ వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో శాంతి స్థిరత్వానికి భారత్ మద్దతు ఇస్తుందని ఈ సందర్బంగా మోదీ కీలక ప్రకటన చేయడం విశేషం. భారత్‌తో సంబంధాలకు టెహ్రాన్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశానికి ముందు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు. ఇరు దేశాలు పలు దఫాల్లో చర్చించడానికి, బ్రిక్స్ సదస్సు ఒక ముఖ్యమైన అవకాశమని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా వాణిజ్యం ఆర్థిక సహకార రంగాలలో ఇరాన్ మంచి సుహృద్భావ సంబంధాలను కలిగి ఉన్న దేశంగా భారత్‌ను బఘాయి పేర్కొన్నారు. మోడీ - పెజెష్కియన్ మధ్య సమావేశంలో చాబహార్ పోర్టు ఒక ప్రధాన అంశంగా ఉంటుందని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తుననారు. ముఖ్యంగా చాబహార్ ఓడరేవుపై ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాకు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను అభివృద్ధి చేసే వ్యూహంలో ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవులో భారత్ చేస్తున్న పెట్టుబడి కీలకమైన అంశంగా ఉంది. ఈ చొరవ ద్వారా, పాకిస్తాన్ మీదుగా వెళ్లే మార్గాలపై ఆధారపడకుండా మధ్య ఆసియా మార్కెట్లకు, అలాగే రష్యా యురేషియా ప్రాంతాలకు, చాబహార్ పోర్ట ద్వారా కనెక్టివిటీ పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ సందర్భంలో కూడా చాబహార్ ఓడరేవు ప్రాముఖ్యతను కలిగి ఉంది. 2024లో విస్తరించిన బ్రిక్స్ కూటమిలో ఇరాన్ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. ఈ కూటమిలో చేరడం ద్వారా వాణిజ్యం, ఇంధనం, ప్రపంచ పాలన, ఆర్థిక సహకారం వంటి అంశాలపై భారత్, రష్యా, చైనా, ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో సంప్రదింపులు జరపడానికి ఇరాన్‌కు మరో ముఖ్యమైన వేదిక లభించింది. ఇరాన్ తన భౌగోళిక స్థానం కారణంగా భారత్‌కు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
Comments
Post a Comment