బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసు : అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంతో దొంగిలించిన మాజీ జవాన్
సికింద్రాబాద్ లోని బొల్లారం ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో సంచలనం సృష్టించిన భారీ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ కలిసి విజయవంతంగా ఛేదించాయి. డిసిప్లిన్ కారణాలతో అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే తీవ్ర ఆగ్రహం, కక్షతోనే మాజీ జవాన్ మల్లేష్ అలియాస్ రాజు ఈ చోరీకి పాల్పడినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. చోరీకి గురైన ఆయుధాలన్నింటినీ రికవరీ చేశామని, ఈ ఘటనతో దేశ భద్రతకు ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేశారు. హెల్త్, ఇన్‌డిసిప్లిన్ కారణాలతో జూన్ 30న మల్లేష్‌ను ఆర్మీ విధుల నుంచి తొలగించారు. దీంతో అకారణంగా తనను తీసేశారనే కోపంతోనే ఆయుధాలను ఎత్తుకెళ్లాడు. ఇందులో ఎలాంటి టెర్రరిస్ట్, డ్రగ్ మాఫియా కోణాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఆయుధాగారం వద్ద రాత్రిపూట సీసీటీవీలు పనిచేయవని తెలిసిన మల్లేష్, జూన్ 28, 29 తేదీల్లో రెక్కీ నిర్వహించాడు. జూన్ 30 రాత్రి కంటోన్మెంట్ పక్కనే ఉన్న బాలాజీ నగర్ నుంచి కార్గిల్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించాడు. గంటసేపు శ్రమించి తాళాలు పగలగొట్టి 7 పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, 4 ఏకే-203 రైఫిళ్లు, 5.56 ఎంఎం మందుగుండు సామగ్రిని స్కూటీపై బయటకు చేర్చాడు. ఆ సమయంలో ఓ ఆర్మీ జవాన్ ప్రశ్నించగా తాను మద్రాస్ రెజిమెంట్ అని నమ్మించి తప్పించుకున్నాడు. ఉదయం 4:34 గంటలకు ఆయుధాలను బాలాజీ నగర్ ఇంటె వద్ద కారులోకి మార్చుకుని, బొంగులూరు గేట్, సాగర్ హైవే ద్వారా అచ్చంపేట వైపు వెళ్లాడు. సీసీటీవీల నిఘా ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే శ్రీశైలం హైవేను దాటవేశాడు. దారిలో దిండి వద్ద ఓ వ్యక్తిని కారు ఎక్కించుకుని పేమెంట్ తీసుకుని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసే యత్నం చేశాడు. ఉదయం 10 గంటలకు అచ్చంపేట చేరుకుని, తన సొంత ఇంటి ముందు ఉన్న గడ్డివాము కింద మట్టి తీసి ఆయుధాలను కప్పిపెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పద్ర గ్రామానికి, అక్కడి నుంచి సెప్టెంబర్ 8న మళ్లీ స్థానాలు మార్చాడు. అనుమానంతో సెప్టెంబర్ 7న నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురంలో ఇల్లు కడుతున్న మల్లేష్‌ను పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పలేదు. మొబైల్‌లో వాట్సాప్ చాట్లు, కాల్ లాగ్స్ మొత్తం డిలీట్ చేసి ఉండటంతో అనుమానం మరింత బలపడింది. 8, 9 తేదీల్లో విచారణకు హాజరుకాకుండా తప్పించు తిరుగుతుండటంతో పోలీసులు అతడి భార్యకు కేసు తీవ్రతను వివరించారు. సెప్టెంబర్ 10న హైదరాబాదుకు తీసుకొచ్చే క్రమంలో భార్య గట్టిగా నిలదీయడంతో మల్లేష్ ఆమె ముందు నేరం ఒప్పుకున్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఆయుధాలన్నింటినీ రికవరీ చేశారు.
Comments
Post a Comment