నకిలీ టీటీడీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు : నకిలీ టీటీడీ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ స్వాధీనం
తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుతో చలామణి అవుతూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న రూపేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లని సాంప్రదాయ వస్త్రాలు ధరించి, పూజారి, టీటీడీ అధికారినని నమ్మబలుకుతూ అతను ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పిల్గ్రిమ్ ఎమెనిటీస్ కాంప్లెక్స్, సీఆర్వో, శ్రీవారి పుష్కరిణి, సుదర్శనం గెస్ట్ హౌస్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అమాయక భక్తులను రూపేష్ ప్రధానంగా టార్గెట్ చేసేవాడు. ప్రత్యేకించి కళ్యాణోత్సవ టికెట్లు, దర్శన టికెట్లు ఇప్పిస్తానని చెప్పాడు. అలా భక్తులను నమ్మించి వారి వద్ద నుంచి ఆధార్ కార్డ్ వివరాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసేవాడు. నగదును Paytm ద్వారా నేరుగా తన సొంత ఖాతాలకు బదిలీ చేయించుకునేవాడు. ఈ తరహాలో దాదాపు 20 మందికి పైగా భక్తుల నుండి లక్షలాది రూపాయలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, నకిలీ టీటీడీ ఐడీ కార్డుతో పాటు రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై ఈ నేరాలకు ఒడిగట్టినట్లు వెల్లడైంది. అంతేకాకుండా రూపేష్‌పై గతంలోనూ అనేక చీటింగ్ కేసులు ఉన్నాయని, తెలంగాణలోనూ మూడు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు. తిరుమలలో టికెట్లు, సేవల పేరుతో దళారులను, నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సేవలను పొందాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Post a Comment