తెలంగాణలో నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై నిషేధం : రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి

తెలంగాణ ప్రభుత్వం నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం   విధించింది.ఏ రూపంలోనైనా పనీర్ తయారు చేయడం, ప్రాసెస్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం, విక్రయించడంపై నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగనుంది. ఇందుకు సంబంధించి అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ నంబర్ 807 జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆహార భద్రత – ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30(2)(a) కింద తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.నిషేధం కేవలం నాన్-డెయిరీ పనీర్ తయారీకి మాత్రమే పరిమితం కాదు. నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌ను 'పనీర్' పేరుతో తయారు చేసి విక్రయించడం, ప్యాక్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం కూడా నిషేధం పరిధిలోకి వస్తుంది. అంటే పాల ఉత్పత్తిగా గుర్తింపు పొందిన పనీర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తిని 'పనీర్' పేరుతో మార్కెట్ చేయడం నిషేధ ఉత్తర్వులకు విరుద్ధంగా పరిగణించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, భద్రత విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లోకి రావడంతో నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్‌ను తయారు చేసే, ప్రాసెస్ చేసే, నిల్వ చేసే లేదా విక్రయించే వ్యాపార సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘా పెట్టే అవకాశం ఉంది.నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వ్యక్తులు, వ్యాపార సంస్థలపై ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నిషేధిత నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌ను తయారు చేయడం లేదా మార్కెట్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వ్యాపారులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం