వడ్డెర సొసైటీలకు రాతి గనులు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాల్లో సుమారు వంద హెక్టార్ల ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని కేవలం వడ్డెర సొసైటీలకే ప్రత్యేకంగా కేటాయిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్న చేతివృత్తిదారులకు గనుల వేలంలో బడా కాంట్రాక్టర్లతో పోటీపడే భారం తప్పేలా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం గుర్తించిన ఈ 100 హెక్టార్ల భూముల్లో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్, క్యూబ్స్, కెర్బ్స్ వంటి సాధారణ భవన నిర్మాణ, రహదారి పనులకు అవసరమయ్యే నాణ్యమైన రాతి ఖనిజాలు విస్తారంగా లభిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ఈ క్వారీపూల్ కింద ఎంపిక చేసిన భూములను కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాల కు మాత్రమే లీజు ప్రాతిపదికన కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులకు గానీ, ఇతర కాంట్రాక్టర్లకు గానీ ఈ భూములను సబ్‌లీజు లేదా బదిలీ చేయడానికి వీల్లేకుండా పక్కా నిబంధనలు రూపొందించారు. వడ్డెరలకు కేవలం లీజులు ఇవ్వడమే కాకుండా, వారిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం భారీ రాయితీలను సైతం వర్తింపజేసింది. క్వారీ లీజు కేటాయింపు సమయంలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంలో ఏకంగా 50 శాతం రాయితీని కల్పించారు. అంతేకాకుండా, తవ్వితీసే ఖనిజ పరిమాణంపై చెల్లించే సీనరేజ్ ఫీజులోనూ వడ్డెర సహకార సంఘాలకు 50 శాతం మినహాయింపు ఇస్తూ గనుల శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వడ్డెర కార్మికులకు పెట్టుబడి వ్యయం సగానికి తగ్గి, గనుల తవ్వకాల్లో లాభసాటి ఆదాయం సమకూరనుంది. గతంలో వేలం పాటల విధానం వల్ల కార్పొరేట్ కంపెనీలతో పోటీపడలేక సాంప్రదాయ వడ్డెర కార్మికులు ఉపాధి కోల్పోయి కూలీలుగా మారిన పరిస్థితి ఉండేది. ఎన్నికల సమయంలోనూ, పాదయాత్రల సందర్భంలోనూ వడ్డెర వర్గాలు తమకు సొంతంగా క్వారీ లీజులు కావాలని చేసిన విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏపీఎంఎంసీ నిబంధనల్లో సవరణలు చేసి మరీ ఈ విధానాన్ని పట్టాలెక్కించింది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం