ఆర్టీసీ ఆపరేషనల్ నష్టాల నుంచి లాభాల దిశగా పయనిస్తోంది : శాసనసభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

శాసనసభలో ఆర్టీసీపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుదీర్ఘంగా, వివరంగా సమాధానమిస్తూ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా, రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థను నిర్వీర్యం చేసి నష్టాల బాటలోకి నెట్టిందని, అలాగే కార్మికుల సమస్యలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఇది మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్టీసీకి కొత్త జీవం పోసిందని, ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగి బస్ స్టేషన్లలో రద్దీ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఇప్పటివరకు 347.47 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించి, రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. ఆసుపత్రులు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు, పిల్లల చదువుల కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. గత సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల వినతులకు అనుగుణంగా కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభించామని, కరోనా సమయంలో రద్దయిన సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ లక్షలాది మందిని సురక్షితంగా చేర్చుతున్న డ్రైవర్లు, కండక్టర్ల సేవలను సభ అభినందించాలని కోరారు. గతంలో ఆపరేషనల్ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల దిశగా పయనిస్తోందని, సంస్థను బలోపేతం చేసేందుకు పాత బస్సుల స్థానంలో ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశామని తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన బస్సులను తొలగిస్తున్నామని, ఇప్పటికే 340 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చామని చెప్పారు. హైదరాబాద్‌లో PM E-Drive కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని, ఈ బస్సుల్లో సీసీ కెమెరాలను అమర్చినట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆదిలాబాద్‌లో ఎస్పీ సహకారంతో బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చామని, భవిష్యత్‌లో అన్ని బస్సులకూ ఇవి విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లను అనుసంధానిస్తూ 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, అన్ని గ్రామాలకు ఆర్టీసీని చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిపోల సంఖ్యను 97 నుంచి 99కి పెంచి, కొత్తగా పెద్దపల్లి, ములుగులలో డిపోలు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట కొత్తవి తెరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు సీఎస్‌ఆర్ నిధులతో బస్ స్టేషన్లలో మౌలిక వసతులు పెంచుతున్నామని, యాదాద్రి వెళ్లే వారి కోసం వంగర వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని, గాజులరామారం, శంషాబాద్, ఫ్యూచర్ సిటీల్లో టెర్మినల్స్ కోసం స్థలాలు సేకరించామని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు తీసుకుంటే, ఆర్టీసీకి కూడా ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తున్నామని చెప్పారు. గతంలో 60 రోజుల సమ్మెను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరిస్తోందని అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు అందిస్తున్నామని, తొలగించబడిన 244 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుని, 1,430 మందికి కారుణ్య నియామకాలు కల్పించామని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం