Ad Code

2050 నాటికి దేశంలో విపత్కర పరిస్థితి : ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు : ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

భారత దేశంలో క్యాన్సర్‌ భారాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జీవనశైలిలో మార్పులు, పొగాకు వినియోగం, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వంటి కారణాలతో క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. 'గ్లోబోకాన్‌ - ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2026'లో పలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో సుమారు 14.1 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు, 9.16 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగి, 2024 నాటికి సుమారు 16.1 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు అంచనా వేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రతి ఏడాది 28 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. క్యాన్సర్‌ రకాలలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్‌ ఎక్కువగా నమోదవుతున్నాయి. పురుషుల్లో మాత్రం పొగాకు వినియోగంతో వచ్చే నోటి క్యాన్సర్‌ ప్రధాన సమస్యగా మారుతోంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. అలాగే క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్ల చికిత్స క్లిష్టమవుతోందని, అందువల్ల మరణాల రేటు కూడా పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం పెరగడం వల్ల రొమ్ము, కొలొరెక్టల్‌, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్ల ప్రమాదం అధికమవుతోంది. అంతేకాదు, గుట్కా, ఖైనీ, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అధికంగా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, రెడ్ మీట్‌, రిఫైన్డ్‌ షుగర్‌ తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవడం కూడా క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతోంది. పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధిక మద్యపానం, వాయు కాలుష్యం వంటి అంశాలు కూడా క్యాన్సర్‌ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని నివేదిక వెల్లడించింది. భారతదేశంలో చాలామంది ప్రారంభ దశలో క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో చికిత్స ఖర్చులు పెరగడంతో పాటు, కోలుకునే అవకాశాలు కూడా తగ్గుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థపేర్కొంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, అందుకే వయసుకు తగిన స్క్రీనింగ్‌ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించింది. జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేస్తే అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ధూమపానం, గుట్కా, తంబాకు వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. మద్యపానాన్ని తగ్గించడం లేదా పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. హెచ్‌పీవీ, హెపటైటిస్‌-బీ వ్యాక్సిన్లు అవసరమైతే వేయించుకోవాలి. వయస్సు, కుటుంబ చరిత్రకు అనుగుణంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్‌ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu