జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త టూ వీలర్స్ లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి !
2026 జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త మోటార్ సైకిళ్లు, స్కూటర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా అమర్చాలని రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లకు మాత్రమే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అవసరంగా ఉన్నప్పటికీ, కొత్త నిబంధన ఇంజిన్ పరిమాణం తేడా లేకుండా అన్ని ద్విచక్ర వాహనాలకు వర్తించనుంది. ఈ ఆదేశం వలన భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా జరిగిన అన్ని ప్రమాదాల్లో 44.5 శాతం ద్విచక్ర వాహనాల వల్ల సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం తలకు గాయాలు లేదా నియంత్రణ కోల్పోవడం వల్ల జరిగాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేని వాహనాల విక్రయాలను ఆపడం తప్పనిసరి చర్యగా మారింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ఆధునిక భద్రతా సాంకేతికత. ఆకస్మికంగా లేదా బలంగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. బ్రేక్ ఒత్తిడిని సెన్సార్‌ల ద్వారా నియంత్రించడం ద్వారా, వాహనం జారిపోకుండా లేదా స్థిరత్వం కోల్పోకుండా ఉంటుంది. తడి రోడ్లు, ఇసుకతో ఉన్న మార్గాలు లేదా అత్యవసర బ్రేకింగ్ పరిస్థితుల్లో ఇది ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమరిక ఉన్న బైక్‌లలో ప్రమాదాలు 35 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గుతాయని నిర్ధారించాయి. ఈ కొత్త నియమం అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 125 సీసీ కంటే తక్కువ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 1.96 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అందులో 1.53 కోట్ల వాహనాలు 125 సీసీ లేదా అంతకంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గలవి. అంటే మొత్తం అమ్మకాలలో సుమారు 78 శాతం వాటా. ఈ విభాగానికి ABS తప్పనిసరి కావడంతో, ఒక్కో వాహనానికి కనీసం రూ. 2,000 వరకు ధర పెరుగుతుందని అంచనా. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి ఆదేశాలతో పాటు, ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం పరిగణనలోకి తీసుకుంటోంది. బైక్ లేదా స్కూటర్ విక్రయించే డీలర్లు కొనుగోలుదారులకు రెండు హెల్మెట్‌లు తప్పనిసరిగా అందించాలి అన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది రైడర్‌తో పాటు పిలియన్ ప్రయాణికుడి భద్రతను కూడా నిర్ధారించడమే లక్ష్యంగా చెప్పవచ్చు.
Comments
Post a Comment