ప్రైవేటు ఆస్పత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం
ఢి ల్లీలో ప్రభుత్వ రాయితీలతో తక్కువ ధరలకు భూములు పొందినప్పటికీ, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమైన 51 ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ ఆస్పత్రులు అమలు చేయకపోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఆస్పత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన కీలక తీర్పు ప్రకారం ప్రభుత్వ రాయితీ భూములపై నిర్మించిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం తప్పనిసరి. ఆ తీర్పు ప్రకారం, ఆస్పత్రుల ఇన్‌పేషెంట్ విభాగంలో కనీసం 10 శాతం బెడ్లను పేదల కోసం కేటాయించాలి. అలాగే ఔట్‌పేషెంట్ విభాగంలో 25 శాతం సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలి. ప్రభుత్వ సబ్సిడీల ప్రయోజనం పొందిన ఆస్పత్రులు సమాజానికి తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి. అయితే, విచారణలో వెలుగులోకి వ...