Posts

Showing posts with the label Huasheng Fireworks

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు : 21 మంది మృతి, 61 మందికి తీవ్ర గాయాలు

Image
చై నాలోని లియుయాంగ్ నగరంలోని 'హువాషెంగ్ ఫైర్‌వర్క్స్' తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది మరణించగా, 61 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. బాణసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనాలు కుప్పకూలాయి. ఘటనా స్థలంలో ఇంకా దట్టమైన పొగ వెలువడుతుండటంతో 500 మందికి పైగా సహాయక సిబ్బందిని మోహరించారు. సమీపంలోని గన్‌పౌడర్ నిల్వ కేంద్రాల వల్ల ముప్పు పొంచి ఉండటంతో చుట్టుపక్కల నివాసితులను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మరియు ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే సదరు కంపెనీ బాధ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సహాయక చర్యల కోసం మూడు రోబోలను కూడా రంగంలోకి దింపారు. ప్రాచీన కాలం నుండి బాణసంచా తయారీకి పేరుగాంచిన లియుయాంగ్ నగరంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా చైనాలో బాణసంచా దుకాణాల్లో రెండు భారీ పేలుళ్లు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు.