అరక్కోణం-రేణిగుంట రైల్వే లైన్ ప్రాజెక్ట్ : పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఊతమిస్తుందన్న పవన్ కల్యాణ్
కేంద్రం ప్రకటించిన అరక్కోణం-రేణిగుంట మధ్య మూడవ, నాల్గవ రైల్వే లైన్ ప్రాజెక్ట్, తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రూ.10,021 కోట్ల విలువైన ఐదు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులలో భాగమైన ఈ విస్తరణ, రద్దీని తగ్గించడానికి, ప్రయాణికుల రాకపోకలను మెరుగుపరచడానికి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పించడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. 10,021 కోట్ల విలువైన ఐదు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థ భారీ మార్పుకు సిద్ధమవుతోందని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనివల్ల దాదాపు 540 కిలోమీటర్ల మేర కొత్త సామర్థ్యం సమకూరనుందని తెలిపారు. దీనివల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడం, కార్యకలాపాలు సాఫీగా సాగడం, సరుకు రవాణా అనుసంధానం మెరుగుపడటం, అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, అరక్కోణం-రేణిగుంట మధ్య 3వ, 4వ లైన్ల నిర్మాణం అత్యంత కీలకం. ఇది తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు, రద్దీని తగ్గిస్తుందని పవన్ తెలిపారు. అలాగే పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్, ప్రాంతీయ అభివృద్ధికి గొప్ప ఊతాన్నిస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా, ఈ కొత్త ప్రాజెక్టులు 17 జిల్లాలను, 2,121 గ్రామాలను దాదాపు 52 లక్షల మంది ప్రజలను అనుసంధానిస్తాయని తెలిపారు. అదే సమయంలో, సంవత్సరానికి 47 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని సృష్టిస్తాయని చెప్పారు.
Comments
Post a Comment