ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌ ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డీ డిజిటల్ హ్యూమన్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ నారాయణ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేష్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా నూతన శకంలోకి అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో 2,000కు పైగా కంపెనీలతో సంపూర్ణమైన లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ ఉందని, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని తెలిపారు. అంతేకాకుండా అమెరికా వెలుపల అత్యధిక యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కేవలం ఔషధ తయారీకే పరిమితం కాకుండా అధునాతన ఆర్‌ అండ్‌ డీ, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల దిశగా దూసుకుపోతోందని చెప్పారు. గత రెండేళ్ల కాలంలో ఆమ్‌జెన్, ఎలీ లిల్లీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, సనోఫీ, అలైన్ టెక్నాలజీ, జోయెటిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30' ద్వారా డ్రగ్ డిస్కవరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, క్లినికల్ రీసెర్చ్ మరియు అత్యాధునిక టెక్నాలజీల అనుసంధానానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఏర్పాటైన 75కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCCs) తోడుగా, త్వరలోనే జీసీసీల సంఖ్యను 100కు చేరుస్తామని, దీనిద్వారా దాదాపు 4 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. అంతేకాకుండా భారత్ ఫ్యూచర్ సిటీలో 2,100 ఎకరాల లైఫ్ సైన్సెస్ జోన్, ప్రత్యేకంగా 100 ఎకరాల్లో బయోలాజిక్స్ హబ్‌తో పాటు 1బయో మోడల్ మౌలిక వసతులను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంఎస్‌డీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి డిజిటల్ సామర్థ్యాలను విస్తరించేందుకు హైదరాబాద్‌లో విస్తారమైన ప్రతిభ, అత్యుత్తమ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని, అందుకే ఈ నగరాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ఈ నూతన కేంద్రం ద్వారా డిజిటల్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజినీరింగ్ సాంకేతికతలతో ప్రపంచవ్యాప్తంగా మానవ మరియు జంతు ఆరోగ్య రక్షణకు అవసరమైన పరిష్కారాలను అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది. జీనోమ్ వ్యాలీతో పాటు ఐఐసీటీ, సీసీఎంబీ, నైపర్  వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలు ఉండటం హైదరాబాద్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోందని వివరించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం