ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు : రూ. 3,409.35 కోట్లతో జలసంరక్షణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాకాల సీజన్ లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో కరవు ఛాయలు అలముకొంటోన్నాయి. క్రమంగా మంచినీటి ఎద్దడి  తలెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద జలాలు వస్తోన్నప్పటికీ అవన్నీ కూడా ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్లే. ఏపీలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో పడట్లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మంచినీటి ఎద్దడి నివారణపై దృష్టి పెట్టింది. ప్రజలకు ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జలధార- జలహారతి కార్యక్రమాన్ని ప్రకటించారు. నిరంతర కార్యక్రమంగా దీన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలాశయాలు, వివిధ నీటి వనరుల్లో ప్రస్తుత లభ్యతను నిరంతరం అంచనా వేస్తూ తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. తాగు నీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే 39 శాతం మేర లోటు వర్షపాతం సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. జలధార-జలహరతిపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగు నీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82,865 పనులను గుర్తించగా, 79,826 పనులు పూర్తి చేసినట్టు ఈ సందర్భంగా అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఆయా పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి మొత్తం 3,409.35 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. చెరువులు, ఫీడర్‌ ఛానళ్లు, ఫార్మ్‌ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం వంటి పనులను చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎల్ నినో తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నాయని, తద్వారా వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ మధ్య సాధారణ వర్షపాతం 867 మిల్లీ మీటర్ల మేర నమోదు అవుతుందని మొదట్లో అంచనాలు వేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం సాధారణ వర్షపాతం 525 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదు అవుుతుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లోకి వస్తున్న వరద నీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం