22 బిలియన్ డాలర్ల విదేశీ మార్పిడి రాబడిని సమకూర్చుకున్న ఉత్తర కొరియా

త్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తన వ్యూహాత్మక మార్గాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆర్థిక రాబడిని పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన కఠిన నిబంధనలను దాటుకుని, 2022, 2025 మధ్య కాలంలో ఉత్తర కొరియా దాదాపు 22 బిలియన్ డాలర్ల విదేశీ మార్పిడి రాబడిని సమకూర్చుకుందని నిపుణుల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఇది అంతకుముందు నాలుగు సంవత్సరాల రాబడి కంటే దాదాపు 4 రెట్లు అధికం కావడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, మాస్కోకు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి అవసరమయ్యాయి. ఈ సమయంలో ఉత్తర కొరియా తన వద్ద ఉన్న సోవియట్ కాలం నాటి ఆర్టిలరీ నిల్వలను రష్యాకు సరఫరా చేయడం ప్రారంభించింది. 2025 ఆఖరు నాటికి రష్యా ఉపయోగిస్తున్న 122 ఎంఎం, 152 ఎంఎం ఆర్టిలరీ షెల్స్‌లో దాదాపు 50 శాతం ఉత్తర కొరియా నుంచే వెళ్లినట్లు అంచనా. అంతేకాకుండా, దాదాపు 16,000 నుండి 22,000 మంది ఉత్తర కొరియా సైనికులను రష్యా తరఫున సహాయంగా పంపడం ద్వారా, ప్రతి సైనికుడికి నెలకు 2,000 డాలర్ల చొప్పున భారీ మొత్తం నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థకు సమకూరింది. కేవలం సాంప్రదాయ ఎగుమతులపైనే ఆధారపడకుండా, ఉత్తర కొరియా డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా సైబర్ కార్యకలాపాలను విస్తరించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిప్టోకరెన్సీ చోరీలలో దాదాపు 70 శాతానికి పైగా ఉత్తర కొరియా సైబర్ బృందాలే కారణమని సైబర్ భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నిధులు రష్యా, చైనాలలోని వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా వ్యవస్థలోకి చేరుతున్నాయి. సైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా వేల కోట్ల డాలర్లను ఉత్తర కొరియా ఆర్జిస్తున్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక వృద్ధి ఉత్తర కొరియా అంతర్గత మార్కెట్‌ను మాత్రమే కాకుండా, దాని సైనిక బలాన్ని మరింత పెంచింది. ప్యాంగ్‌యాంగ్ ఆర్థిక వ్యవస్థ 2025లో 3.5 శాతం మేర వృద్ధి చెందింది. అంతేకాదు, ఉత్తర కొరియా తన సైన్యంలో 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ యుద్ధనౌకలను ప్రవేశపెట్టింది. వీటిలో రష్యన్ సాంకేతికతతో కూడిన వైమానిక రక్షణ వ్యవస్థలు అమర్చినట్లు సమాచారం. ఇక, రష్యా నుండి లభిస్తున్న సాంకేతిక సహకారంతో ఉత్తర కొరియా తన క్షిపణి, డ్రోన్ తయారీ కార్యక్రమాలను వేగవంతం చేసింది. గత 35 సంవత్సరాలలో ఉత్తర కొరియా ఎన్నడూ లేనంత బలమైన వ్యూహాత్మక స్థితిలో ఉందని రాజనీతి విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంక్షల ద్వారా ఆర్థికంగా ఒంటరిని చేసి చర్చలకు తీసుకురావచ్చనే పాశ్చాత్య దేశాల అంచనాలను దాటుకుని, ఉత్తర కొరియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వయం సమృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రాభావాన్ని చూపుతోంది. అగ్రదేశాలను ఢీకొనే సత్తాను సంపాదించుకుంది. సవాళ్లకు ఎదురొడ్డి నిలబడితే ఎంత ఎత్తైన ఎదగవచ్చని కిమ్‌ మరోసారి నిరూపించుకున్నాడు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం