'మిషన్ శక్తిశాట్'కి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని జెస్సీ

ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ 'మిషన్ శక్తిశాట్' కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ, మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ శ్రీమతి కేశన్ తో కలిసి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ.. 'మిషన్ శక్తిశాట్' ఎంపికై రికార్డ్ సృష్టించారు. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో చోటు దక్కించుకుని ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచారు. ఈ సందర్భంగా జెస్సీ మాట్లాడుతూ.. పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా చేసిన ప్రయోగాలు తనలో ఆసక్తి రేకిత్తించాయని చెప్పారు. ఏడో తరగతి నుంచే తనకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగిందని వివరించారు. మిషన్ శక్తిశాట్ లో మొత్తం 550 సెషన్లు, 21 మాడ్యూల్స్ నేర్చుకున్నట్లు తెలిపారు. భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఒకరిగా నిలవడం ఆనందంగా ఉందని, భవిష్యత్ లో ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనేది తన లక్ష్యమని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి చేస్తున్న 22 క్లస్టర్లలో స్పేస్ సిటీ క్లస్టర్ కూడా ఒకటని, అంతరిక్ష రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. మిషన్ శక్తిశాట్ కు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా కందుల జెస్సీని మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మిషన్ శక్తిశాట్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం