వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ : సీఎం డీకే శివకుమార్ ప్రకటన
కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గాన్ని రాబోయే వారంలో విస్తరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. చిత్రదుర్గ వేదికగా జరిగిన బెంగళూరు రీజనల్ డివిజన్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ విస్తరణ తక్షణమే పూర్తి కానుందని, ఆ వెంటనే మంత్రులందరూ సమష్టిగా బాధ్యతలు నిర్వర్తించాలని సీఎం స్పష్టం చేశారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వడ్డికెరె గ్రామంలో స్వయంగా పర్యటించిన ఆయన, రైతులపై కరువు చూపుతున్న ప్రభావాన్ని పరిశీలించారు. ప్రభుత్వ యంత్రాంగం, శాసనసభ్యులు అంతా కలిసికట్టుగా ‘టీమ్ కర్ణాటక’ స్ఫూర్తితో పనిచేయాలని, ప్రజా పాలన ప్రతి పౌరుడి గడపకూ చేరేలా ‘ప్రజా సేవా’ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 1 కోటి వరకు ఖర్చు చేసే అధికారాన్ని జిల్లా యంత్రాగానికి కల్పించినట్లు డీకే శివకుమార్ గుర్తుచేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన బోరుబావుల జీపీఎస్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సహాయక చర్యల్లో ఎక్కడా లోపాలు లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని హెచ్చరించారు. ప్రజలతో పాటు మూగజీవాలకు సైతం తాగునీరు, తగినంత పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయనే అంచనాతో రైతులు తొందరపడి పంటలు సాగు చేయవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. ఒకవేళ నష్టపోతే బాధ్యత వారే వహించాల్సి వస్తుందని, పంటల బీమా పథకాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. అల్మట్టి మినహా రాష్ట్రంలోని ఇతర జలాశయాల్లో నీటి మట్టాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ సంక్షోభ సమయంలో తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంపై ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో, కరువు పరిస్థితులను వివరించేందుకు డిప్యూటీ సీఎం పరమేశ్వర నేతృత్వంలోని బృందం త్వరలో ప్రధాని మోదీని కలవనుందని వెల్లడించారు.
Comments
Post a Comment