తెలంగాణలో 31 లక్షల ఓట్లు గల్లంతు?
తెలంగాణలో నిర్వహిస్తున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో లేని దాదాపు 31 లక్షల ఫారమ్‌లను ఎన్నికల సంఘం ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్, ఫారిన్ కేటగిరీ కింద వర్గీకరించి తొలగింపునకు సిద్ధం చేసింది. హైదరాబాద్ జిల్లాలోనే ఆదివారం నాటికి 51 శాతం ఎన్యుమరేషన్ ఫారమ్‌ల డిజిటైజేషన్ పూర్తి కాగా, ఇప్పటివరకు ఏకంగా 4.21 లక్షల మందిని ఈ జాబితాలో చేర్చినట్లు సీఈవో వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో బూత్ స్థాయి అధికారులు , బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుండటంతో, సరైన తనిఖీలు జరగక ప్రతి పోలింగ్ బూత్‌లో వందలాది మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరైన నిబంధనలు , ప్రామాణిక ప్రక్రియలను పాటించకుండానే ముందస్తుగా చాలా మంది ఓటర్లను ASDDF జాబితాలో చేర్చుతున్నారని పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి వల్ల, బీఎల్‌ఓలు ప్రతీ ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలనే నిబంధనను పక్కనపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి బూత్‌లో సుమారు 300 నుంచి 600 మంది ఓటర్లు ఇంకా ఫారమ్‌లు అందుకోలేదని, దాంతో వారంతా ఈ వర్గం కింద ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. తొలగింపులపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమయం అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయికి వెళ్లకుండానే తొందరపాటుగా సంతకాలు చేయాలనడాన్ని పలు పార్టీల బిఎల్‌ఏలు నిరాకరిస్తున్నారు. ఈ విషయమై ఎన్నికల నమోదు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 3 గడువును ప్రామాణికంగా తీసుకుని పూర్తిస్థాయిలో ఇంటింటి తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తొలగింపుల అంశం తెలంగాణలో రాజకీయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Post a Comment