ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా తిరిగి వేగంగా అడుగులు వేస్తోంది : రైజింగ్ భారత్ సమ్మిట్ - సౌత్ ఎడిషన్ 2026లో మంత్రి టి.జి. భరత్

క్షిణ భారతదేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా అవతరిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు. న్యూస్18 నిర్వహించిన రైజింగ్ భారత్ సమ్మిట్ - సౌత్ ఎడిషన్ 2026లో ప్రత్యేక చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌ల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే బలమైన పారిశ్రామిక వ్యవస్థను ఏర్పరచుకున్నాయని పేర్కొన్న మంత్రి, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అభివృద్ధి దిశగా తిరిగి వేగంగా అడుగులు వేస్తోందన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిందని, అనంతరం 2019లో అధికారాన్ని కోల్పోయినా, 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 1,050 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతం ఉండటం పెద్ద బలమని మంత్రి పేర్కొన్నారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, మూడు ఎన్ఐసీడీఐసీ  ప్రాజెక్టులు, కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి బలాన్నిస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయత కారణంగా అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, ఇప్పటికే పలు అవగాహన ఒప్పందాలు  కుదిరి, వాటి అమలు ప్రక్రియ కూడా ప్రారంభమైందని వెల్లడించారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉందని, ఇప్పుడు అంతకంటే ముందుకు వెళ్లి "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కేబినెట్ ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిని వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న కీలక పారిశ్రామిక ప్రాజెక్టుల గురించి కూడా మంత్రి వివరించారు. అంకపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఆర్సెలర్‌మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేవలం తొమ్మిది నెలల్లోనే పర్యావరణ అనుమతులు లభించడం ప్రభుత్వ వేగవంతమైన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టును చేపడుతోందని చెప్పారు. అలాగే డిఫెన్స్, ఏరోస్పేస్, కెమికల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే వందకు పైగా పార్కులకు శంకుస్థాపనలు పూర్తయ్యాయని తెలిపారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను హబ్-అండ్-స్పోక్ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని, కొత్త పరిశ్రమలకు ప్రారంభ దశలో 30 నుంచి 45 శాతం వరకు సబ్సిడీ రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని టి.జి. భరత్ స్పష్టం చేశారు. గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం 3,500 నుంచి 4,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, రాష్ట్రంలో ప్రతిపాదిస్తున్న 6 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 6 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని, నీటి కొరత సమస్య తలెత్తదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు అవగాహన ఒప్పందాలు, కేబినెట్ అనుమతులు పొందాయని వెల్లడించిన మంత్రి, భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రతి సంస్థ ముందుగా ఆంధ్రప్రదేశ్‌ను పరిశీలించాలని ఆహ్వానించారు. వేగవంతమైన అనుమతులు, విశ్వాసాన్ని పెంపొందించే పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త కేంద్రంగా ఎదుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం