Ad Code

ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్‌ విడుదల


దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్ ఫోన్‌ 'ఐటెల్ ఆక్వా' విడుదల అయింది. నీరు, ధూళి నుండి రక్షణ కల్పించే ఐపీ67 రేటింగ్‌తో రావడం ఈ ఫోన్ అత్యంత ప్రత్యేకత. ఇంత తక్కువ ధరలో ఈ తరహా రక్షణ ఉన్న ఫోన్ రావడం మొబైల్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐటెల్ ఆక్వా ధరను కేవలం రూ. 1,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ బ్లూ, రెడ్ , బ్లాక్ రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 2.4-అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఎండలో లేదా బయట తిరిగేటప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మెరుగైన బ్రైట్‌నెస్ లెవెల్స్‌తో దీనిని డిజైన్ చేశారు. ఈ ఫోన్ ప్రాసెసర్ , ర్యామ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా, ఇందులో ఐకాన్లతో కూడిన 1,000 కాంటాక్ట్ నంబర్లను, 250 మెసేజ్లను దాచుకోవచ్చు , 60 కాల్ లాగ్స్ హిస్టరీని భద్రపరుచుకోవచ్చు. ఫోటోల కోసం ఐటెల్ ఆక్వా వెనుక భాగంలో వీజీఏ కెమెరాను అమర్చారు. వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు ఇందులో 'ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్'  ఫీచర్‌ను జత చేశారు. దీనివల్ల అవతలి వారికి మన వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీనితో పాటు 'కింగ్ వాయిస్' అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా ఇచ్చారు. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఫోన్ మెనూ, కాల్ సమాచారం , నోటిఫికేషన్లను వాయిస్ రూపంలో చదివి వినిపిస్తుంది. ఈ ఫోన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, తమిళ్, గుజరాతీ, పంజాబీ, కన్నడ , మలయాళంతో కలిపి మొత్తం 10 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ సపోర్ట్, రికార్డింగ్ సదుపాయంతో కూడిన వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా ఫైళ్లను వైర్‌లెస్‌గా షేర్ చేసుకోవచ్చు. వీటితో పాటు స్పీడ్ డయల్ సపోర్ట్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్, ఇన్‌స్టంట్ రీడింగ్, టైమ్ అప్‌డేట్ సపోర్ట్ , ఫోన్ బుక్ ఎంట్రీలను చదివే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 1,200mAh సామర్థ్యం ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడుగా ఛార్జింగ్ కోసం ఆధునిక యూఎస్‌బీ టైప్-సి పోర్టును అందించడం విశేషం. ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ ఇచ్చేందుకు ఇందులో 'సూపర్ బ్యాటరీ మోడ్' కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్‌కు ఉన్న ఐపీ67 రేటింగ్ వల్ల.. ఇది ప్రమాదవశాత్తు కింద పడినా, వర్షంలో తడిసినా, బురదలో లేదా నీటిలో పడినా తట్టుకునేలా అత్యంత బలంగా నిర్మించబడింది. 

Post a Comment

0 Comments

Close Menu