తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ మీ - సేవ విధానం
తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ మీ - సేవ విధానంను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్దమైంది. ముఖ్యమైన హెల్ప్ లైన్లను అనుసంధానం చేయటం ద్వారా ఏ సందర్భంలో అయినా ఉపయోగపడేలా తాజా మార్పులతో అప్ గ్రేడ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ - సేవ విధానంలో కొత్త మార్పులు ప్రవేశ పెడుతోంది. 108, 102, 101, గ్యాస్ సిలిండర్ బుకింగ్ తదితర ముఖ్యమైన హెల్ప్ లైన్ నంబర్లన్నింటినీ లింక్ చేయనున్నారు. పెద్ద సంఖ్యలో లబ్దిదారులు డిజిటల్ సర్వీసులు అందుకున్నారు. దీని ద్వారా గతంలో వలే మీ-సేవ కేంద్రాల ఎదుట క్యూ కట్టే అవసరం లేకుండా సేవలను ప్రజల వద్దకే తీసుకొచ్చింది. మొత్తం పదికి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 రకాల సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. 80969 58096 వాట్సప్ నంబర్ ద్వారా నిర్విరామంగా 24 గంటలూ పౌర సేవలు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మెసేజ్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన పూర్తి సమాచారం పొందే వెసులుబాటు కల్పించారు. వాట్సాప్ వినియోగం పైన అవగాహన లేని వారికి సులభంగా అర్దమయ్యే విధంగా రూపకల్పన చేసారు. రాష్ట్రంలోని 31 ప్రధాన దేవాలయాలకు సంబంధించిన దర్శనం.. వసతి సేవలు సైతం ఇందులో అందుబాటు లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ -సేవతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపుగా 80 వేల మందికి పైగా సేవలు పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు ఆరు కోట్ల లావాదేవీలు నమోదైనట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ల స్టేటస్, తాజా అప్‌డేట్స్ కూడా వాట్సాప్ లోనే తెలుసుకోవటం, ఆమోదం పొందిన సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండటంతో లబ్ది దారులకు ప్రయోజనకరంగా మారుతోంది. త్వరలో అత్యవసర సేవల నంబర్లను కూడా వాట్సాప్ మీ-సేవకు అనుసంధానం చేయటం ద్వారా మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఈ సదుపాయం వినియోగం ద్వారా దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు వెంటనే తెలిసిపోతాయి. సర్టిఫికెట్ లేదా డాక్యుమెంట్ సిద్ధం కాగానే దాని డౌన్‌లోడ్ లింక్ నేరుగా వాట్సాప్ కే వస్తుంది. ఆ తర్వాత మనుకు డౌన్‌లోడ్ అవుతుంది. దీంతో.. కొత్తగా ప్రవేశ పెడుతన్న ఎమర్జెన్సీ సేవల ద్వారా వినియోగదారులకు సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Post a Comment