మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాసం, ఆర్థిక భరోసా కల్పిస్తాం : డీజీపీ శివధర్ రెడ్డి


డవుల్లో కొనసాగుతున్న సాయుధ పోరాటం ఇక ప్రయోజనం లేనిదిగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం చేయలేని స్థితి ఏర్పడిందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని, లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాసం, ఆర్థిక భరోసా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా బలహీనపడిందనేందుకు గణాంకాలే సాక్ష్యమని డీజీపీ తెలిపారు. ఒకప్పుడు పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మందికి పైగా సభ్యులు ఉండేవారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య కేవలం 66కు మాత్రమే పరిమితమైందన్నారు. ఈ సంఖ్యను బట్టి చూస్తే సాయుధ విభాగం పూర్తిగా క్షీణించినట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తాజా లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ఒకరు మాత్రమే మిగిలి ఉన్నారని వెల్లడించారు. సీఎం పిలుపుతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని డీజీపీ గుర్తు చేశారు. లొంగిపోయే వారి స్థాయి ఆధారంగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. డివిజన్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, ఇతర సభ్యులకు రూ.1 లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది కేవలం రివార్డు మాత్రమే కాకుండా, వారికి కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రభుత్వం అందించే సహాయంలో భాగమని వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు మొత్తం 17 మంది మాత్రమే ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వీరిలో కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు ఉండగా, మిగతా ఇద్దరు అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ 17 మందిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వీరిపై మొత్తం రూ.2.25 కోట్ల రివార్డు ఉందని వెల్లడించారు. ఈ అందరూ లొంగిపోతే తెలంగాణ పూర్తిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లొంగుబాట్లు ఈ దిశగా కీలక మలుపుగా మారాయని అధికారులు భావిస్తున్నారు. డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా లొంగిపోవడం సంచలనంగా మారింది. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన కీలక నేత కంకణాల రాజిరెడ్డి కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి బృందానికి చెందిన మరో 48 మంది కూడా ప్రధాన స్రవంతిలోకి రావడం గమనార్హం. ఒకప్పుడు 41 మంది కేంద్ర కమిటీ సభ్యులతో బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ, తాజా పరిణామాలతో కేవలం నలుగురు కేంద్ర కమిటీ సభ్యులకే పరిమితమైందని డీజీపీ తెలిపారు. ఆపరేషన్ 'కగార్' గడువు పూర్తయ్యేలోపే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం