మీ సోదరుడి పనులు చేశాను, మీ పనులు చేయకపోతే మీరు ఫిర్యాదు చేస్తారు కదా !


పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మధ్య జరిగిన భేటీ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. కేరళలోని రహదారి ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో అటు సీరియస్ చర్చలు, ఇటు సరదా సంభాషణలు, ఓ ప్రత్యేక వంటకం హైలైట్‌గా నిలిచాయి. వయనాడ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రియాంకా గాంధీ తన నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ నితిన్ గడ్కరీని కలిసి కేరళ మీదుగా వెళ్లే ఆరు ప్రధాన రహదారి ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రియాంకా గాంధీ కంటే ముందే ఆమె సోదరుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్‌బరేలీకి సంబంధించిన రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. దీనిని గుర్తు చేస్తూ గడ్కరీ "మీ సోదరుడి పనులు చేశాను, ఇప్పుడు మీ పనులు చేయకపోతే అన్నయ్య పనులు చేశారు కానీ నావి చేయలేదని మీరు ఫిర్యాదు చేస్తారు కదా!" అని చమత్కరించారు. ఈ మాటలకు ప్రియాంకా గాంధీతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. రాజకీయ చర్చల మధ్యే గడ్కరీ తన అతిథులకు ప్రత్యేక రుచులను రుచి చూపించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నితిన్ గడ్కరీ స్వయంగా ఓ బియ్యం వంటకాన్ని తయారు చేశారు. ఈ రోజు తనను కలవడానికి వచ్చిన ఎంపీలందరికీ ఆయన ఈ వంటకాన్ని వడ్డించారు. ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా కూడా ఆ వంటకాన్ని రుచి చూస్తూ మంత్రితో సంభాషించారు. ప్రియాంక కోరిన ఆరు ప్రాజెక్టులలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వాటిని కేంద్రం నేరుగా చేపట్టలేదని గడ్కరీ వివరించారు. అయితే మిగిలిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ ప్రస్తుతం కేరళలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కింద ఉన్న ప్రాజెక్టులను, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే స్వయంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం