ఆర్మీ క్యాంటీన్లలో తక్కువ ధరకే మారుతి సుజుకి స్విఫ్ట్ !


ఆర్మీ క్యాంటీన్లలో అమ్ముడయ్యే వస్తువులపై సగం పన్ను రాయితీ ఉంటుంది. అంటే సివిల్ మార్కెట్‌లో పన్ను 18 శాతానికి తగ్గితే, క్యాంటీన్‌లో అది కేవలం 14 శాతంగానే ఉంటుంది. ఈ మార్పుల వల్ల మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలపై భారీ ప్రభావం పడింది. కార్స్ 24 తాజా నివేదిక ప్రకారం స్విఫ్ట్ బేస్ మోడల్ అయిన LXI ధర ఇప్పుడు క్యాంటీన్‌లో కేవలం రూ. 5.07 లక్షలకే లభిస్తోంది. బయటి మార్కెట్‌లో దీని ధర రూ. 6.49 లక్షలుగా ఉండగా, సైనికులకు దాదాపు రూ. 1.42 లక్షల మేర ఆదా అవుతోంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ల విషయానికి వస్తే లాభం మరింత పెరుగుతోంది. వేరియంట్ల వారీగా చూస్తే స్విఫ్ట్ VXI మోడల్ షోరూమ్ ధర రూ. 7.29 లక్షలు కాగా, క్యాంటీన్‌లో రూ. 5.74 లక్షలకే లభిస్తోంది. అలాగే ZXI మోడల్ మీద రూ. 1.68 లక్షలు, ZXI+ మీద రూ. 1.76 లక్షల వరకు రాయితీ లభిస్తోంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇష్టపడే వారికి కూడా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ZXI+ AMT టాప్ వేరియంట్ బయట రూ. 9.49 లక్షలు ఉంటే, క్యాంటీన్‌లో కేవలం రూ. 7.60 లక్షలకే దొరుకుతుంది. అంటే ఒక కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 1.89 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 34 సీఎస్‌డీ డిపోల ద్వారా అర్హులైన వారు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. కొత్త తరం మారుతి స్విఫ్ట్ కేవలం ధరలోనే కాదు, ఫీచర్ల పరంగా కూడా అదరగొడుతోంది. ఇందులో కొత్తగా రూపొందించిన 1.2 లీటర్ Z2E 3-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 80 bhp శక్తిని, 112 Nm టార్క్‌ను అందిస్తుంది. ముఖ్యంగా మైలేజీ విషయంలో ఈ కారు రికార్డులు సృష్టిస్తోంది. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.80 కి.మీ, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 25.75 కి.మీ, CNG వేరియంట్ ఏకంగా కిలోకు 32.85 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 9 అంగుళాల స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెనుక ఏసీ వెంట్స్ వంటి మోడ్రన్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ వస్తాయి. ఈ సీఎస్‌డీ ప్రయోజనాలు కేవలం భారత సాయుధ దళాలలో పనిచేస్తున్న వారికి, రిటైర్డ్ సైనికులకు, వారి వితంతువులకు, రక్షణ రంగ పౌర ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ రాయితీలు వ్యక్తిగత ఉపయోగం కోసం ఉద్దేశించినవి కాబట్టి, క్యాంటీన్ ద్వారా కొన్న కార్లను ఒక నిర్ణీత కాలపరిమితి వరకు బయట మార్కెట్‌లో తిరిగి అమ్మడానికి వీలుండదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ పన్నుతో లభించే ఈ వాహనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కండిషన్లు పెట్టారు. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం