సదరం ఫీజులు తీసుకోకూడదని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కోసం 'సదరం' కింద స్లాట్ల బుకింగ్ ఈనెల 14న పునఃప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సాంకేతిక కారణాలతో గత సెప్టెంబరు నెలాఖరు నుంచి నిలిచిన స్లాటు బుకింగ్ లు శుక్రవారం ప్రారంభించి, డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు 10 వేల మందికి స్లాటు బుకింగ్ ఖరారులో తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆ తరువాత కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి స్లాట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్‌కు రూ.40, జారీ చేసిన సర్టిఫికెట్ ముద్రణకు రూ.40 చొప్పున ఫీజులు వసూలు చేసేవారని, దివ్యాంగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఫీజులు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. సదరం కింద సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైద్యుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. దీని ప్రకారం డిసెంబరు నెలాఖరునాటికి 31,050 మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇంతకుముందు 112 ఆసుపత్రుల్లో పరీక్షలు జరపగా.. ఈ సారి అదనంగా మరో ఆరు ఆసుపత్రులను ఈ జాబితాలో చేర్చామని వెల్లడించారు. వైద్యుల అందుబాటుకు అనుగుణంగా అసుపత్రులను ఖరారు చేసినట్లు చెప్పారు. కాళ్లు, చేతుల సమస్యలు (లోకోమోటర్), కంటి చూపు మందగించడం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మందబుద్ధిలోపం కేటగిరిల్లో దరఖాస్తుదారులకు ఉన్న వైకల్య శాతాన్ని అనుసరించి వైద్యులు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. వీటికి అనుగుణంగా పింఛన్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది. గతంలో వైకల్యం తక్కువగా నిర్ధారణ అయిన వారికి అప్పీల్ అవకాశాన్ని కల్పించగా లక్షా 4 వేల మంది అప్పీల్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 19,235 మందికి తిరిగి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారికి కూడా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో జరుగుతాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ (డియస్‌హెచ్‌) కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి అప్పీల్ చేసుకున్న వారందరికీ పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పింఛన్ పొందే వారిలో మిగిలిన 1.87 లక్షల మందికి రీ-అసెస్ మెంట్ పరీక్షలు జరపాల్సి ఉందని డియస్‌హెచ్ చక్రధర్ బాబు తెలిపారు. వీరికి జనవరి నుంచి రీ-అసెస్ మెంటు పరీక్షలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం