విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపాలి : ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలిగించి సభ నుంచి పంపించివేయాలని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నా, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సభను సక్రమంగా నిర్వహించడం చేతకాక, విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రతి అరగంటకోసారి వాయిదాల పర్వానికి తెరలేపుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు. అయితే ఎలాంటి చర్యలైనా ప్రజాస్వామ్యాన్ని ఆపలేవని పేర్కొన్నారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం అత్యంత దారుణమని, ఈ క్రమంలో పోలీసులను కూడా ప్రభుత్వం బలిపశువులను చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాలం ముగిసిందని, త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Post a Comment