ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు అంబటి రాంబాబు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి !
ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇటీవల అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. ఆ వీడియోలన్నీ పూర్తిగా కల్పితమని, తన రాజకీయ ప్రతిష్టను మసకబార్చేందుకు వైకాపా నేతలు ఆడుతున్న డ్రామాలో భాగమేనని ఆమె కొట్టిపారేశారు. సాంకేతికతను వాడుకుని తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమాజంలో మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశాలను, వారిపై జరిగే ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని గల్లా మాధవి ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం చేయడం పక్కన పెట్టి, బురదజల్లే రాజకీయాలకు పాల్పడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు గానూ అంబటి రాంబాబు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, త్వరలోనే ఆయనకు న్యాయపరమైన నోటీసులు పంపుతామని గల్లా మాధవి ఈ సందర్భంగా వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళపై జరిగిన ఘటనను వాడుకోవడం దుర్మార్గమని మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు.
Comments
Post a Comment