హైదరాబాద్ లో తాగునీటి కనెక్షన్ డిస్కనెక్ట్ పేరుతో కొత్త తరహా సైబర్ స్కామ్ !
హైదరాబాద్ లో తాగునీటి కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేస్తున్నామంటూ వచ్చిన నకిలీ ఏపీకే ఫైలును క్లిక్ చేసిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.56 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నాగోలు బండ్లగూడ సమీపంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన పాల్వాయ్ శ్రీధర్‌రెడ్డికి ఈ నెల 22న జలమండలి సిటిజన్స్ సర్వీస్ పేరుతో "మీ తాగునీటి కనెక్షన్ నిలిపివేస్తున్నాం" అంటూ ఓ ఏపీకే ఫైల్ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగానే ఆయన ప్రమేయం లేకుండానే మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ అయింది. అనంతరం ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకపోయినా, డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ, పిన్ లేదా పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోకపోయినా, ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.56 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రజలు అపరిచిత ఏపీకే ఫైళ్లు, లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment