జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: క్యూర్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణంపై సిఎం రేవంత్‌ సమీక్ష

హైదరాబాద్‌నగరంలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకాన క్యూర్‌ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. క్యూర్‌ పరిధిలో ఇళ్లపై ఉన్నతాధికారులతో ఆయన సక్ష నిర్వహించారు. ఓఆర్‌ఆర్‌ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ స్థలాలను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన స్థలాలను తీసుకుని.. ఆయా శాఖలకు వేరే చోట కేటాయించాలని రేవంత్‌ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను జనావాసాలకు దూరంగా కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా.. జనావాసాల పరిధిలో ఇళ్లు నిర్మిస్తే నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారన్నారు. క్యూర్‌ ఏరియాలోని పలు నియోజకవర్గాల్లో ఒక్కో ప్లాట్‌ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో ఇళ్లు నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, దీనిలో ప్రభుత్వం రూ. 5 లక్షల మేర సబ్సిడీని అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్దిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. భూమికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనుంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి ఇళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని పేర్కొన్నారు. పోలీస్‌, రెవెన్యూ, రవాణా శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను గృహ నిర్మాణం కోసం వినియోగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఖాళీ ప్రభుత్వ భూముల గుర్తింపు పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు నగరానికి చేరువలోనే గృహాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్, కార్వాన్‌, బహదూర్‌పురా, అంబర్‌పేట్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, మలక్‌పేట్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే పక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం