అన్నమయ్య జిల్లాలో 14 బీసీ హాస్టళ్ల మూసివేత : రాయచోటి రెసిడెన్షియల్ స్కూల్ కు విద్యార్థుల తరలింపు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో అడ్మిషన్లు తక్కువగా ఉన్న 14 బీసీ హాస్టళ్లు మూసివేయాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాలు జారీ చేశారు. 100 మంది కంటే తక్కువగా విద్యా ర్థులు ఉన్న వసతి గృహాలను మూసివేసి జిల్లాలోని రాయచోటిలో కొత్తగా మంజూరైన బీసీ రెసిడెన్షియల్ స్కూల్ (ఎంజేపీఏ పీబీసీ డబ్ల్యూఆర్)కు కొంతమంది చేర్పించి, మిగిలిన వారిని సమీపంలోని హాస్టళ్లకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తంబళ్లపల్లె, బి.కొత్తకోట, నిమ్మనపల్లె, మేడికుర్తి, రైల్వేకోడూరు, నందలూరు, తాళ్లపాక, వగళ్ల, రామసముద్రం, పీటీఎం, వీరబల్లి బీసీ బాలుర హాస్టళ్లు, ములకలచెరువు, లక్కి రెడ్డిపల్లె, వాల్మీకిపురం బీసీ బాలికల హాస్టళ్లు మూసివేయాలని నిర్ణయించారు. ఈ హాస్టళ్లలో కొత్త అడ్మిషన్లు లేకుండా చేశారు. ఇప్పటికే హాస్టళ్లలో ఉంటూ పై తరగతులకు పునరుద్ధరణ కావాల్సిన పిల్లలను కొత్తగా మంజూరైన రెసిడెన్షియల్ స్కూల్‌కు, సమీపంలోని హాస్టళ్లకు తరలించనున్నారు. దశాబ్దాలుగా ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాలను ప్రస్తుతం అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయంటూ మూసివేస్తుండటంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. వాల్మీకిపురంలో ఓ దాత విలువైన స్థలంతో పాటు బీసీ బాలికల హాస్టలను దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించి ఇవ్వగా వేలాది మంది అందులో చదువుకున్నారు. ఇక ఈ హాస్టల్ భవనాలు నిరుపయోగంగా ఉంటాయి. ప్రభుత్వం ఏకంగా 14 హాస్టళ్లు మూసివేస్తే మళ్లీ తెరిచే అవకాశాలు ఉండవని, ఉన్నవాటిని కాపాడాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
Comments
Post a Comment