అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం విరాళాన్ని అందజేసిన భువనేశ్వరి : ఏప్రిల్ 20న అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, నారా భువనేశ్వరి ఒక వినూత్నమైన , మానవీయమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజంలోని నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా భావించి ఆమె అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తంతో చంద్రబాబు పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో లక్షలాది మంది పేదలకు, రోజువారీ కూలీలకు పూర్తి ఉచితంగా భోజనాన్ని అందించనున్నారు. అన్న క్యాంటీన్లు పేదల పాలిట కల్పవృక్షాలని, ఇవి కేవలం భోజనశాలలు మాత్రమే కాదని, అన్నం పెట్టే అమ్మ ను తలపిస్తున్నాయని ప్రశంసించారు. కేవలం రూ.5 లకే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టినరోజున కూడా తిరుమల అన్నప్రసాదానికి విరాళం ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని, ఇప్పుడు చంద్రబాబు పుట్టినరోజున ఈ సేవలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. భువనేశ్వరి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఒక గొప్ప సామాజిక బ్రాండ్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పుట్టినరోజులు, వివాహ వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించాలని, తద్వారా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Post a Comment