రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ధోరణి : రెడీ-టు-మూవ్ లేదా రీసేల్ ఫ్లాట్ల వైపు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు


కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్టుల కోసం గతంలో వేచి చూసే మధ్యతరగతి ప్రజలు, ఇప్పుడు తమ చూపును రెడీ-టు-మూవ్ లేదా రీసేల్ ఫ్లాట్ల వైపు మళ్లిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే. సిమెంట్, స్టీల్ ధరలతో పాటు లేబర్ ఛార్జీలు కూడా గత ఏడాదితో పోలిస్తే 3-5% వరకు పెరగడం భారాన్ని పెంచింది. ఈ అదనపు భారాన్ని వారు కస్టమర్లపైనే వేస్తుండటంతో కొత్త ఫ్లాట్ల ధరలు సామాన్యుడి బడ్జెట్ దాటిపోతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా రెట్టింపు భారం పడుతోందని సగటు ఇన్వెస్టర్ భావిస్తున్నాడు. ఒకవైపు ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ ఇఎంఐ కడుతూనే, మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించడం మధ్యతరగతి కుటుంబాలకు కష్టతరంగా మారింది. దీనికి తోడు ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదా? అనే సందిగ్ధత కూడా వారిని వెంటాడుతోంది. అదే రెడీ-టు-మూవ్ ఫ్లాట్ అయితే, వెంటనే గృహప్రవేశం చేసి అద్దె భారం తగ్గించుకోవచ్చనేది వారి ఆలోచన. దీంతో పాత ఫ్లాట్లకు ఉన్న డిమాండ్ ఈ వారాంతపు మార్కెట్ ట్రెండ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రీసేల్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపడానికి మరో బలమైన కారణం స్పేస్ . 2026లో వస్తున్న కొత్త లాంచ్‌లలో లోడింగ్ ఫ్యాక్టర్ 35 నుండి 40 శాతం వరకు ఉంటోంది. అంటే మీరు 1600 చదరపు అడుగుల ఫ్లాట్ కొంటే, అందులో నివసించడానికి దక్కే స్థలం తక్కువగా ఉంటోంది. కానీ, 8-10 ఏళ్ల క్రితం కట్టిన పాత అపార్ట్‌మెంట్లలో లోడింగ్ ఫ్యాక్టర్ కేవలం 20-25 శాతం మాత్రమే ఉండేది. అంటే అదే ధరలో పాత ఫ్లాట్ కొంటే ఎక్కువ స్థలం, పెద్ద గదులు వస్తాయని కొనుగోలుదారులు గణిస్తున్నారు. పైగా పాత భవనాలలో యుడిఎస్ కూడా ఎక్కువగా లభిస్తుండటం భవిష్యత్తు పెట్టుబడిగా వారు భావిస్తున్నారు. కొత్త ఫ్లాట్లపై 5 శాతం జిఎస్‌టి అదనంగా ఉండటం, కానీ పూర్తిస్థాయిలో సిద్ధమైన ఫ్లాట్లకు జిఎస్‌టి లేకపోవడం కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. రూ.15 లక్షలు వెచ్చించి పాత ఫ్లాట్‌ను కొత్తగా రినోవేట్ చేసుకున్నా, అది కొత్త లాంచ్ కంటే తక్కువ ధరకే వస్తోందని మధ్యతరగతి కుటుంబాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం మార్కెట్లో రీసేల్ మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం