విజయవాడలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు : తుపాకీతో కాల్పులకు తెగబడ్డ దుండగుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న 'ఆపరేషన్ వజ్ర ప్రహార్'లో భాగంగా విజయవాడలో శనివారం తెల్లవారుజామున హోటళ్లలో పోలీసులు, ప్రత్యేక ఈగల్ టీమ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక సాయుధ దుండగుడు ఏకంగా అధికారులపైనే తుపాకీ గురిపెట్టి కాల్పులకు తెగబడ్డాడు. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తి గదిని తనిఖీ చేస్తుండగా, అతడు అకస్మాత్తుగా తన వద్ద ఉన్న పిస్టల్‌ను తీసి పోలీసులపైకి ట్రిగ్గర్ నొక్కాడు. అయితే పిస్టల్‌లో బుల్లెట్ ఛాంబర్‌లోకి రాకపోవడంతో అది పేలలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తన ప్రయత్నం విఫలం కావడంతో పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్ జిల్లాకు చెందిన మురళిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద ఉన్న మారణాయుధాన్ని, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అసలు అతడు విజయవాడకు ఎందుకు వచ్చాడు? అతడికి తుపాకీ ఎక్కడ దొరికింది? నగరంలో ఎవరినైనా హతమార్చేందుకు కుట్ర పన్నాడా? అనే కోణాల్లో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో విజయవాడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీల పరిసరాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డన్ సెర్చ్‌లను ముమ్మరం చేస్తామని అధికారులు వెల్లడించారు.
Comments
Post a Comment