మూసీ ఒడ్డున 100 అడుగుల శివుడి విగ్రహం : భారీ గాలి గోపురం, విశాలమైన మండపాలు
మూసీ ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఓంకారేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గండిపేట మండలం మంచిరేవుల ప్రాంతంలో సుమారు 8 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. రూ.663 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రముఖ పీఠాధిపతుల సూచనలు తీసుకుని ఆధునిక శైలిలో రూపకల్పన చేశారు. ఈ ఆలయం ప్రత్యేకతల్లో 100 అడుగుల ఎత్తైన శివ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే భారీ గాలి గోపురం, విశాలమైన మండపాలు, పూజలు, హోమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన మండపం 200 అడుగులకు పైగా పొడవుతో నిర్మించబడనుండగా, గర్భాలయం కూడా విశాలంగా ఉండేలా డిజైన్ చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లను ఇక్కడ కూడా వినియోగించనున్నారు. మూసీ నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణం ద్వారా నీటి నిల్వలు పెంచడం, బోటింగ్ వంటి వినోద సౌకర్యాలను అందించడం కూడా ప్రణాళికలో భాగం. ఆలయం చుట్టూ రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులు చేపట్టి, ఈ ప్రాంతాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆలయం వరకు సౌకర్యవంతమైన మార్గాలు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు ఉండటం ప్రత్యేకత. హైదరాబాద్ సమీపంలోని గండిపేట మండలంలో ఉన్న మంచిరేవుల గ్రామం ఉంది. ఈ గ్రామ సమీపంలో 800 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న వీరభద్రస్వామి ఆలయం, ఆ పక్కనే 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం ఉంది. అయితే ఈ ఆలయాలకు సమీపంలో ఓంకారేశ్వర విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్లానే చేసింది. వీరభద్రస్వామి, మచిలేశ్వర స్వామి ఆలయాలు పురాతన కాలం నాటి విశేష చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. సహజ గుహల్లో ఉన్న శివలింగాలు, పురాతన నిర్మాణ శైలులు భక్తులను ఆకర్షిస్తున్నాయి. చరిత్రలో పలువురు ప్రముఖులు ఈ ఆలయాలను దర్శించినట్లు చెబుతారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా చేపడుతున్న ఈ ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధి పనులు హైదరాబాద్‌కు కొత్త గుర్తింపును తీసుకురానున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రముఖ ధార్మిక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Post a Comment