మహిళా కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం : సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సీతారామపురం విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ జ్యోతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ శాఖ నిబంధనలను అతిక్రమించి విలేకరుల సమావేశాన్ని నిర్వహించినందుకుగాను పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇటీవల సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డిని విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఇదే ఠాణాలో పనిచేసే మహిళా కానిస్టేబుల్ జ్యోతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గమనించిన సహచరులు, ఆమెను వెంటనే వింజమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె స్వగ్రామానికి వెళ్లి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయగిరి సీఐ వెంకట్రావు, సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనకు ఎస్ఐతో అక్రమ సంబంధంవుందని సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఆరోపించారు. అందువల్లే శివకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ వెంకట్రావుపై నిరాధార ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అనిత వేజండ్ల ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Post a Comment