బంగ్లాదేశ్ సుంకాలను 19 శాతానికి తగ్గించిన అమెరికా : దుస్తులకు సుంకాల నుండి పూర్తిగా మినహాయింపు
బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను 19 శాతానికి తగ్గించారు. గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా తొలుత 37 శాతం సుంకాన్ని ప్రతిపాదించగా, సుదీర్ఘ చర్చల దరిమిలా గత ఆగస్టులో దానిని 20 శాతానికి తగ్గించారు. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఇది మరింత తగ్గి 19 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా అమెరికా ముడి పదార్థాలను (కాటన్, కృత్రిమ నూలు) ఉపయోగించి, బంగ్లాదేశ్‌లో తయారు చేసే దుస్తులకు సుంకాల నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కూడా అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్‌లో ప్రాధాన్యత కల్పించేందుకు అంగీకరించింది. రసాయనాలు, వైద్య పరికరాలు, యంత్రాలు, మోటార్ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు సోయా, డెయిరీ, బీఫ్, పౌల్ట్రీ వంటి అమెరికా ఆహార ఉత్పత్తులకు బంగ్లాదేశ్‌లో మార్కెట్ ఏర్పడనున్నది. అమెరికా 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' (ఎఫ్‌డీఏ) ధృవీకరణలను ఇకపై బంగ్లాదేశ్ గుర్తించనుంది. రాబోయే 15 ఏళ్లలో అమెరికా నుండి సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ.1,36,063 కోట్లు) విలువైన ఇంధన ఉత్పత్తులను, 3.5 బిలియన్ డాలర్ల (రూ.31,748 కోట్లు) వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. విమానయాన రంగంలో 'బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్' అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుండి 14 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వీటితో పాటు అదనపు ఆర్డర్లకు కూడా అవకాశం ఉంది. రక్షణ రంగంలో సైతం బంగ్లాదేశ్ అమెరికా నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేయనుంది. అంతర్జాతీయ కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
Comments
Post a Comment