మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటన
మెక్సికోలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు మెక్సికోను పరిపాలిస్తున్నారు. ఆ దేశ స్థితిని చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది. ఏం చేస్తాం. మాదక ద్రవ్యాల రవాణాదారులు పాలిస్తున్నారు. వారి కారణంగా అమెరికాలో 300,000 మంది చనిపోతున్నారని సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. అంతకు ముందు గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ సముద్ర మార్గాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా పెద్ద విజయం సాధించిందని, ఇప్పుడు భూ మార్గాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. సముద్రం ద్వారా వచ్చే మాదక ద్రవ్యాలను దాదాపు 97 శాతం కంట్రోల్ చేశామని, ఇప్పుడు డ్రగ్స్ కార్టెలపై భూ దాడులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మెక్సికోను మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులే పాలిస్తున్నారని, ఇది చాలా విచారకరమని ఆ దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ అమెరికా సైనిక చర్యను ఖండించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. షీన్‌బామ్ మాట్లాడుతూ మెక్సికో భద్రతా విషయంలో అమెరికాకు సహకరిస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో అంతర్జాతీయంగా సహకారం చాలా అవసరం అని, అయితే ఈ సహకారం పరస్పర గౌరవం, సమానత్వంపై ఆధారపడి ఉండాలని స్పష్టం చేశారు. మెక్సికోను ప్రజలే పాలిస్తున్నారని తెలిపారు. ఏదో సాకుతో మెక్సికోను స్వాధీనం చేసుకుంటామంటే అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విదేశీ సైనిక జోక్యాన్ని అంగీకరించబోమని షీన్‌బామ్ వ్యాఖ్యానించారు. గత శనివారం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చింది. ఆ సమయంలోనే త్వరలోనే కొలంబియా, మెక్సికో, క్యూబా దేశాలపై దాడులు చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మెక్సికోపై దాడి చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Post a Comment