రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు : ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని, త్వరలో వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయంపై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు. రాష్ట్రంలో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రత్యేకించి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. అలాగే ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 60 రోజుల్లోనే తమ కార్యాచరణను ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఓ న్యూ ఎనర్జీ హబ్‌గా మారాలని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందని అన్నారు. అలాగే విద్యుత్ సంస్థలు రుణ సమీకరణలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలోనూ వ్యయం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. గత పాలకులు విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేశారని సీఎం తెలిపారు. పీపీఏల రద్దు నిర్ణయంతో రూ.9 వేల కోట్ల మేర భారం ప్రజలపై పడిందని పేర్కొన్నారు. విద్యుత్‌ను వినియోగించుకోకుండానే ఆయా విద్యుత్ కంపెనీలకు రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆ భారాన్ని జీరో చేయగలిగామన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం