మరో వ్యక్తిపై పులి దాడి !
తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి చేసింది. ఓ యువతిపై దాడి చేసి 24 గంటలు గడిచిందో లేదో సిర్పూర్ (టి)మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన మరో రైతుపై పులిదాడి చేసి గాయపరిచింది. పొలంలో సురేష్ అనే రైతు పని చేస్తుండగా పెద్దపులి దాడి చేసింది. పక్కనే ఉన్న వారంతా గట్టిగా కేకలు వేసి అరవడంతో పులి భయపడి పారిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరిపై దాడి చేసింది. ఇందులో ఒకరు చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగజ్ నగర్ మండలంలో నజ్రుల్ నగర్ విలేజ్ పరిదిలో శుక్రవారం పులి పంజా దెబ్బకు గన్నారం గ్రామానికి చెంది 21 ఏళ్ల మోర్లె లక్ష్మి మృత్యువాత పడ్డారు. పొలంలో పత్తి ఏరుతుండగా పులి వచ్చి దాడి చేసింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో పులి దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది. మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు నాలుగేళ్లుగా నలుగురిని బలి తీసుకున్నాయి. ఇలా పులి దాడిలో చనిపోయిన వారంతా కూలీలు, చిన్న రైతులే. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment