ఢిల్లీలో ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి పట్ల కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి !
ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువతి తండ్రి విజయ్ కుమార్ సింగరేణి శ్రీరామ్‌పూర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థిని భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్ ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఢిల్లీ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అయితే భారీ వర్షాలకు ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద నీరు చేరింది. బేస్మెంట్‌లోని లైబ్రరీలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటుండగా ఒక్కసారిగా నీరు ముంచెత్తింది. దీంతో ఎటూ వెళ్లలేని స్థితిలో విద్యార్థులు తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28) నీట మునిగి మృతి చెందారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మరికొంతమంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. దీనిపై 24గంటల్లో నివేదిక ఇవ్వాలని ఢిల్లీ మంత్రి అతిశీ రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Post a Comment