బడ్జెట్‌లో రైల్వేకు ₹2.62 లక్షల కోట్లు కేటాయింపు !
బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ మొత్తంలో రైల్వేలో భద్రతా వ్యవస్థల మెరుగు, కవచ్ ఇన్‌స్టలేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించిన కేటాయింపులపై విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌లో రైల్వేకు ఎప్పుడూ లేని విధంగా రూ.2,62,200 కోట్లు కేటాయించినట్లు అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఇందులో రూ.1.08 లక్షల కోట్లు రైల్వే భద్రతకు వినియోగించనున్నట్లు తెలిపారు. పాత ట్రాకుల స్థానే కొత్తవి ఏర్పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవచ్ వ్యవస్థ ఇన్‌స్టలేషన్ ఇందులో ఉన్నాయన్నారు. అన్నింటిలో కల్లా కవచ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇటీవలే కవచ్ 4.0కు ఆమోదం లభించిందని, ఇన్‌స్టలేషన్ త్వరతిగతిన చేపడతామని వెల్లడించారు.
Comments
Post a Comment