తెలంగాణ తల్లి రూపం మార్పుపై మాట్లాడే హక్కు భారాసకు లేదు !
తల్లి తెలంగాణ పార్టీ మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007లో ఆవిష్కరించిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలిపారు. అప్పుడు విగ్రహాన్ని బీఎస్ రాములు రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం కొంత కాలానికి భారాస తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. కానీ ఆ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా విగ్రహానికి అధికారిక హోదా, గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఈమేరకు ఆమె 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసిందని చెప్పారు. భారాసకు తెలంగాణ తల్లి రూపం మార్పుపై కొట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. తల్లి తెలంగాణ పార్టీ రూపొందించిన విగ్రహాన్ని గతంలో భారాస మార్చితే ఎవరైనా కొట్లాడారా..? అని ప్రశ్నించారు. మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నాయి. వాటిని రాజకీయ పార్టీల ప్రయోజనాలకు వాడుకోవద్దని విజయశాంతి హితవు పలికారు.