బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస : 32 మంది మృతి !
బం గ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇటీవల ఇదే అంశంపై చోటుచేసుకున్న ఘర్షణల్లో దాదాపు 200లకు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను మన రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో టచ్‌లో ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించాలని బంగ్లాదేశ్ హోంశాఖ నిర్ణయించింది. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధానమంత్రి షేక్ హసీనా పేర్కొన్నారు. అటువంటి వారిని అణచివేయాలని పౌరులకు పిలుపునిచ్చారు.