అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ముందుగానే కుట్రలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణ
అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ముందుగానే కుట్రలు పన్నారని ఆయన ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై చర్చించేందుకే సమావేశాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 22ఏ భూముల అంశంతో పాటు ఇతర కీలక విషయాలను సభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ అంశాలపై చర్చ జరిగితే బీఆర్ఎస్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి ప్రత్యక్ష విచారణకు ఆదేశించారు. ఈ విచారణ కోసం అధికారిగా విజయ్‌కుమార్‌ను నియమించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల వ్యవహారంపై కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఈ పరిణామాల అనంతరం సభ వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిపించుకుని సమావేశాలు జరగకుండా కుట్రకు ప్రణాళిక రూపొందించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉత్తరాఖండ్ ఘటనను ఖండిస్తూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం.. అలాంటి పరిస్థితినే తెలంగాణలోనూ చూశామని అన్నారు. అసెంబ్లీ ఎదుట విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కొంతమంది దాడికి పాల్పడ్డారని, స్పీకర్‌తో పాటు ఆయన తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను సమాజం మొత్తం ఖండించిందని అన్నారు. పార్లమెంట్, ముంబై, పుల్వామా దాడుల్లో పాల్గొన్న తీవ్రవాదులుగా, ఉన్మాదులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోల్చుతూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రలు జరిగాయని ఆరోపిస్తూ అక్కడే నిరసన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేయడం తమ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో డప్పు కొట్టి దండోరా ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశామని చెప్పారు.
Comments
Post a Comment